తెలంగాణ కు కరోనా అలర్ట్ ప్రకటించిన కేంద్రం

కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. పోయిందాలే అని ఎప్పటికప్పుడు అనుకుంటూ వస్తున్నప్పటికీ..ఆ మాయదారి మహమ్మారి మాత్రం మనుషుల ప్రాణాలను వదలడం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ తో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం తో కేంద్రం అప్రమత్తం చేసింది. అప్రమత్తం చేసిన వాటిలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో సూచించారు.

రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కరోనా ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్ , ట్రీట్ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం కోరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 754 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 నెలల తర్వాత ఇవే గరిష్ట కేసులు కావడం ఆందోళన కలిగించే అంశం. కోవిడ్తో కర్ణాటకలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 4,633 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన వారం రోజులుగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.