మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం : కరెంట్ షాక్ తో మూడేళ్ల బాలుడు మృతి

వర్షాల నేపథ్యంలో కరెంట్ విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో పిల్లలు ,పెద్దలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు ఏంచేస్తున్నారు..? ఏముంటుకుంటున్నారు..? ఎక్కడ చేతులు పెడుతున్నారనేది తల్లిదండ్రులు , ఇంట్లో పెద్ద వారు కనిపెడుతూ ఉండాలి..లేదంటే అనర్దాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ కూలర్‌ వైర్లు పట్టు కోవడంతో మూడేళ్ల బాలుడు షాక్ కు గురై చనిపోయాడు.

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన దరావత్‌ భాస్కర్‌-కళ్యాణి దంపతులు ఇంటి వద్ద పని చేసుకుంటుండగా వారి కుమారుడు అర్జున్‌ (3) ఇంటి పక్కనే ఉన్న అమ్మమ్మ కాంతమ్మ ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్‌ వైర్లు పట్టు కోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే తల్లితుండ్రులు బాలుడ్ని మహబుబాబాద్‌ హాస్పటల్ కు తీసుకవెళ్లగా మృతిచెందినట్లు డాక్టర్స్ తెలిపారు. అయితే ఇద్దరు ఆడ సంతానం తర్వాత పుట్టిన కుమారుడు కావటంతో అర్జున్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మూడేళ్లకే అల్లారు ముద్దు గా పెంచుకున్న కొడుకు మృతి చెందటంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.