ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..40 మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారని వినికిడి. ప్రస్తుతం 29 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు ఉన్నారు. ఆయన భార్య, ఆదిలాబాద్‌ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్‌ సుమన అలియాస్‌ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలో బస్తర్‌ రీజియన్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు.

ఇక శంకర్‌రావు ఫై రూ.25 లక్షల రివార్డు ఉన్నది. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్‌ రైఫిళ్లు, కార్బైన్‌, 303 రైపిల్స్‌, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, చికిత్స కోసం దవాఖానకు తరలించినట్టు బస్తర్‌ రేంజ్‌ ఐజీపీ పీ సుందర్‌రాజ్‌ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్రైక్‌గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైనట్టు సమాచారం. భద్రతా బలగాలు ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు చేయడంతో కింది ప్రదేశంలో ఉన్న మావోయిస్టులు తప్పించుకొనేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలిసింది. రెండు వర్గాల మధ్య సుమారు 4 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తున్నది. కాల్పుల అనంతరం మావోయిస్టులు పారిపోయిన తర్వాత భద్రతా దళాలు ఘటనాస్థలాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.