మళ్లీ బీజేపీలోకి చేరడం ఫై గాలి జనార్దన్ క్లారిటీ

గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వారు లేరు. మైనింగ్ రారాజు గా గాలి జనార్దన్ రెడ్డి ని పిలుస్తారు. మైనింగ్ లో కొన్ని వందల కోట్లను సంపాదించాడు. అంతే కాదు అక్రమ మైనింగ్ కేసులో రెండేళ్ల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపాడు. జైలు నుండి వచ్చి మళ్లీ వ్యాపారాల్లో బిజీ గా ఉన్న జనార్దన్ ..రీసెంట్ గా “కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ” అనే పార్టీ ని ప్రకటించారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. బిజెపితో తన బంధం ముగిసింది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా తన పార్టీని నిర్మిస్తానని, కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు గాలి జనార్దన్ మళ్లీ సొంత గూటికి వెళ్ళబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇచ్చారు.

ఈ వార్తల్లో ఏ మాత్రం కూడా నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాను వెనకడుగు వేయనని, బోనులో ఉన్నా కూడా పులి పులే అని అన్నారు. ఇతరులకు షాక్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, విదేశాల్లో తనకు డబ్బు ఉందని చెపుతున్నారని… ఆ సొమ్మును కనిపెట్టేందుకు ఏజెన్సీలకు ఎన్ని రోజులు పడుతుందని అడిగారు. విదేశాల్లో ఉందని చెపుతున్న డబ్బును తెస్తే… దాన్ని ప్రజలకే పంచి పెడతానని అన్నారు. తాను స్థాపించిన పార్టీలోకి ఇతర నేతలు చేరకుండా చేసేందుకే తాను బీజేపీలోకి వస్తున్నాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పార్టీతో తాను ముందుకు వెళ్లకుండా లొంగదీసుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది వారి పొరపాటే అవుతుందని ఆయన అన్నారు.