12వ జాబితా విడుదల చేసిన బీజేపీ

bjp

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి ఏడుగురు అభ్యర్థులతో కూడిన 12వ జాబితాను మంగళవారం రిలీజ్‌ చేసింది.

ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని కీలకమైన డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ దాస్‌కు అవకాశం కల్పించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అభిషేక్‌ బెనర్జీకి పోటీగా బీజేపీ అభిజిత్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఇక యూపీలోని రెండు స్థానాల నుంచి అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఫిరోజాబాద్ నుంచి ఠాకూర్ విశ్వజిత్ సింగ్, డియోరియా స్థానం నుంచి శశాంక్ మణి త్రిపాఠికి అవకాశం కల్పించింది. మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ స్థానం నుంచి ఛత్రపతి ఉదయన్‌ రాజే భోంస్లే ఎన్నికల బరిలో నిలిచారు.

ఇక పంజాబ్‌ రాష్ట్రంలోని మూడు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖదూర్‌ సాహిబ్‌ లోక్‌సభ స్థానం నుంచి మంజీత్‌ సింగ్‌ మన్నా మియావింద్‌, హోషియార్‌పూర్ (ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచి అనితా సోమ్ ప్రకాష్, భటిండా లోక్‌సభ స్థానం నుంచి పరంపల్ కౌర్ సింధు (ఐఏఎస్)ను లోక్‌సభ అభ్యర్థులుగా ఖరారు చేసింది.