ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి

బలూచిస్తాన్‌ : పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ వ్యాన్‌ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. జోబ్‌ నేషనల్‌ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో ప్రమాదం జరిగినట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, ఇందులో 22 మంది మరణించినట్లు పేర్కొంది.

ఈ ప్రమాదం నుండి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయటపడ్డట్లు పేర్కొంది. బుధవారం ఉదయం 23 మందితో వ్యాన్‌ జోబ్‌కు వెళ్తున్న సమయంలో.. అక్తర్‌ జాయ్‌ సమీపంలో కొండపై నుంచి వ్యాన్‌లో లోయలో పడిపోయిందని జిల్లా డిప్యూటీ కమిషనర్‌ హఫీజ్‌ ముహమ్మద్‌ ఖాసిం తెలిపారు. ప్రమాదంలో బాలుడు గాయపడ్డారని, చికిత్స కోసం క్వెట్టాకు తరలించినట్లు చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు, 11 మంది వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో విచారం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/