రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం..మ‌ద్ద‌తు ప‌లికిన‌ ఎంకే స్టాలిన్

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన‌ ‘భార‌త్ జోడో’ కు..డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ మ‌ద్ద‌తు ప‌లికారు. తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ యాత్ర ప్రారంభమైంది. దేశ ప్రజలందరినీ సంఘటితం చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు రాహుల్. జాతీయ జెండా కేవలం మూడు రంగులు కాదని..ప్రతి భారతీయుడి స్వేచ్ఛకు అది ప్రతీక అన్నారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల సమైక్యతకు జాతీయ జెండా చిహ్నమని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ యాత్ర వ‌ద్ద‌కు వ‌చ్చిన స్టాలిన్‌… రాహుల్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీని స‌న్మానించిన స్టాలిన్‌… ప‌లు అంశాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీలను విపక్షాలపై అస్త్రాలుగా వాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి అన్ని వ్యవస్థలపై దాడులు చేయిస్తున్నాయన్నారు. కేంద్రం తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్లే దేశం ఇప్పుడు అత్యంత దుర్భర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.