నైట్​ క్లబ్​లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

థాయ్‌లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు థాయ్​లోని చోన్​బురి ప్రావిన్స్​లోని సత్తాహిప్ జిల్లా సమీపంలో గల మౌంటెన్ బి నైట్​ క్లబ్​లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా.. మరో 40 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ అధికారులు నైట్‌క్లబ్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మృతుల్లో విదేశీయులు లేరని స్థానిక మీడియా తెలిపింది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురై పలువురు కేకలు పెడుతూ బయటకు పరుగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియో లలో కనిపిస్తున్నాయి. వారిలో కొంత మంది దుస్తులకు నిప్పు అంటుకుని ఉన్నట్టు కనిపిస్తున్నాయి, మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. చాలా వరకు మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు. మంటలను అదుపులోనికి తీసుకురావడానికి సుమారు మూడు గంటల సమయం పట్టినట్టు అధికారులు వివరించారు.