ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా టిఆర్ఎస్ నేతల మాటల యుద్ధం

ఢిల్లీ లిక్కర్ స్కాం తో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంబంధనలు ఉన్నట్లు బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల ఫై టిఆర్ఎస్ నేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను ఎలా ఎదుర్కోవాలో తెలియక కాషాయ పార్టీ బురద జల్లే రాజకీయం చేస్తుందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. తప్పుడు కేసులకు, కాసులకు టీఆర్‌ఎస్‌ లొంగిపోదని, భయపడదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ రాజీపడి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదే కాదన్నారు. కళంకితులకు అడ్డ, అక్రమార్కులకు అడ్డగా బీజేపీ మారిందని, సీబీఐ సెంట్రల్‌.. బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ఆరోపించారు.

ప్రధాని మోడీ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతున్నందుకే బీజేపీ నేత‌లు దాడులకు దిగుతున్నార‌ని, ప్ర‌శాంతంగా ఉన్న తెలంగాణ‌లో చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ క‌విత ఇంటిపై బీజేపీ దాడి దారుణమని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఓ మ‌హిళా నాయ‌కురాలి ఇంటిపై దౌర్జ‌న్యం చేయ‌డం విచార‌క‌ర‌మని, ఇదేనా బీజేపీ సంస్కారం అని నిల‌దీశారు.

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై రావడం దుర్మార్గమని, హేయమైన చర్యని తలసాని అన్నారు. మీ ఇంట్ల మీదికి రావాలంటే పెద్ద విషయం కాదని, మా టీఆర్‌ఎస్‌ సైన్యం ఎంతో తెలుసా? అన్న ఆయన.. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.