దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం రేపు హైదరాబాద్ లో ఆవిష్కారం కాబోతుంది..

దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం రేపు ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆవిష్కారం కాబోతుంది. హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విగ్రహ నిర్మాణం చేపట్టింది.

ట్యాంక్ బండ్ పరిధిలో 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.. విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ మార్గాల్లో ఈ ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉండనున్నాయి. వాహనాలను దారి మళ్లించనున్నారు పోలీసులు. అయితే ఈ ఏరియాలకు వచ్చే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ఇక ఈ మహావిగ్రహ ప్రత్యేకతలు, చూస్తే..

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో దాదాపు 11.80 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహ నిర్మాణం చేపట్టారు.

విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.

ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు. మెుత్తంగా భూమి నుంచి స్మారకం ఎత్తు 175 అడుగులు.

రూ.146.50 కోట్ల అంచనా వ్యయంతో విగ్రహ నిర్మాణం చేపట్టారు.

ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడి వాడారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహ నిర్మాణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు

దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా ఇది రికార్డు నెలకొల్పింది .

పార్లమెంట్ ఆకారంలో రెండు ఎకరాల్లో పీఠం నిర్మాణం చేపట్టారు. పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇందులో ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేడ్కర్‌ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటుకానుంది.

భవనం లోపల ఆడియో విజువల్‌ రూమ్స్‌ ఉన్నాయి. లైబ్రరీలో అంబేడ్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేసారు.

2.93 ఎకరాల్లో థీమ్ పార్కుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు రాక్‌గార్డెన్‌, , వాటర్‌ ఫౌంటేన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌శాండ్‌ స్టోన్‌ ఉన్నాయి. స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపే అవకాశం ఉంటుంది.