నాందేడ్‌ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది రోగుల మరణాలు

108 patients died in Nanded hospital in 8 days

ముంబయిః మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ కారణాలతో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అక్కడ మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే పసికందుతో సహా మొత్తం 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాందేడ్‌ ఆసుపత్రిలో గత 8 రోజుల వ్యవధిలోనే వివిధ కారణాలతో మరణించిన వారి సంఖ్య 108కి పెరిగింది.

గత 24 గంటల వ్యవధిలో పలు కారణాలతో మొత్తం 1,100 మంది రోగులు వైద్యచికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిలో 191 మంది ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు. కాగా, మరణాల రేటు గతంతో పోలిస్తే కాస్త తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు. అంతకుముందు 24 గంటల్లో సగటు మరణాల రేటు 13గా ఉండేదని.. ప్రస్తుతం ఆ సంఖ్య 11కి పడిపోయినట్లు వివరించారు. కాగా, ఆసుపత్రిలో రోగుల వరుస మరణాలకు మందుల కొరతే కారణమని వస్తున్న వార్తలపై సదరు వైద్య వర్గాలు కొట్టిపారేశారు.

కాగా, ఇటీవలే మహారాష్ట్రలోని పలు ఆసుపత్రుల్లో కూడా రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని జీఎంసీహెచ్‌లో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయని ఓ అధికారి తెలిపారు. నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి లో 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, నగరంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి లో 24 గంటల్లో తొమ్మిది మరణాలు సంభవించినట్లు ఆసుపత్రి సీనియర్‌ వైద్యులు తెలిపారు.