మరోసారి భారతీయ సంపన్నుల్లో నెం.1గా నిలిచిన ముఖేశ్ అంబానీ

360 వన్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితా విడుదల

Mukesh Ambani now richest Indian on Hurun List, beats Gautam Adani to top spot

న్యూఢిల్లీః రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారతీయ సంపన్నుల్లో నెం.1గా నిలిచారు. మంగళవారం విడుదలైన 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2023లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంబానీ వ్యక్తిగత సంపద విలువ రూ.8.08 లక్షల కోట్లుగా ఉన్నట్టు తేలింది. అంబానీ తరువాతి స్థానంలో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఉన్నారు. హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా ఆయన సంపద రూ.4.74 లక్షల కోట్లకే పరిమితమైంది.

కాగా, కనీసం రూ.1000 కోట్ల సంపద కలిగిన వారికే ఈ జాబితాలో చోటుదక్కింది. 20 ఏళ్ల వయసులోనే ఈ జాబితాలోకి ఎక్కిన జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా ఈ లిస్టులో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అత్యధికంగా ఫార్మారంగానికి చెందిన 133 మందికి చోటు దక్కింది. ధనవంతులు అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబైది (328 మంది ధనవంతులు) తొలిస్థానం.

తెలుగు రాష్ట్రాల్లో అపరకుబేరులు వీరే..

ఏపీ, తెలంగాణలకు చెందిన మొత్తం 105 మంది సంపన్నులకు ఈ జాబితాలో చోటుదక్కింది. వీరిలో 87 మంది హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దివి లేబోరేటరీస్‌‌కు చెందిన మురళి దివి కుటుంబం రూ.55,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో నెం.1గా నిలిచింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన పి.పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్ల సంపదతో 37 స్థానంలో ఉన్నారు. రూ. 35,800 కోట్ల సంపదతో పీవీ కృష్ణా రెడ్డి 41 స్థానంలో నిలిచారు. ఇక హెటిరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారథి రెడ్డి కుటుంబం రూ.21,000 కోట్లతో 93వ స్థానం దక్కించుకుంది. అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రతాప్ సీ రెడ్డి రూ. 20,900 కోట్ల వ్యక్తిగత సంపదతో 99వ స్థానంలో నిలిచారు.