మయన్మార్‌లో దారుణానికి ఒడిగట్టిన సైన్యం

మయన్మార్‌లో సైన్యం దారుణానికి ఒడిగట్టింది . సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గం నిర్వహించిన కార్యక్రమంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 100 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉండడం బాధాకరం. మంగళవారం ఉదయం 8 గంటలకు సగైగ్‌ ప్రాంతంలోని పజిగ్యి గ్రామంలో సైనిక వ్యతిరేక కార్యాలయ ప్రారంభోత్సవంలో సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వాయుసేనకు చెందిన విమానం వారిపై బాంబులు వేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మృతి చెందారని మిలిటరీ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఆ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు.

నేషనల్‌ యూనిటీ గవర్నమెంటుకు (NUG) చెందిన పీపుల్స్‌ డిఫెన్స్‌ కార్యాలయ ప్రారంభం సందర్భంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. తమదే అసలైన ప్రభుత్వమని ఎన్‌యూజీ చెప్పుకుంటున్నదని, అది సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని తెలిపారు. మృతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫైటర్లు కూడా ఉన్నారని, వారిలో కొందరు సాధారణ పౌరుల్లా దుస్తులు ధరించాలని చెప్పారు. పీపుల్స్‌ డిఫెన్స్ ఫోర్స్‌ ఆ ప్రాంతంలో మందుపాత్రలు పాతిపెట్టడంతోనే చాలా మంది మరణించారని ఆరోపించారు. స్థానిక ప్రజలను భయపెట్టి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఫిబ్రవరి 2021లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిని సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. బలగాల దాడిలో ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.