చైనాలో భారీ వర్షాలు : 12 మంది మృతి

బీజింగ్ : చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి సెంట్రల్‌ చైనా హెనాన్‌ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌ నగరం గజగజ వణికిపోతున్నది. నగరాన్ని పూర్తి వరద ముంచెత్తడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే లక్ష మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి, విద్యుత్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వాహనాలు వరద నీటిలో కాగితపు పడవలను తలపిస్తూ కొట్టుకుపోయాయి.

సుమారు 160 రైళ్లు జెంగ్‌జౌ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయాయి. రైళ్లలోకి నడుంలోతు వరద నీరు చేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. బుధవారం రాత్రి సైతం హెనాన్‌ ప్రావిన్స్‌లో కుండవృష్టి కురిసింది. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరద సహాయక, అత్యవసర స్పందనా బృందాలు హెనాన్‌ ప్రావిన్స్‌లో సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :