తన తలపై నజరానా.. స్పందించిన ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తా..సాధువు

10-rupee-comb-enough-says-stalin-junior-on-alleged-10-crore-bounty-on-head

చెన్నైః తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది. సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు చెందిన సాధువు ఒకరు ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే తానే స్వయంగా ఉదయనిధిని వెతికి పట్టుకుని ఆ పని పూర్తిచేస్తానని చెప్పారు. ఈ ప్రకటనపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.

తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తెలియదని ఉదయనిధి అన్నారు. రూ. పది కోట్లు ఎందుకు, పది రూపాయల దువ్వెన ఇస్తే తానే తన తల దువ్వుకుంటానని చెప్పారు. ఛాప్, స్లిట్ అనే పదాలకు తమిళంలో తల దువ్వుకోవడమనే అర్థం ఉంది. ఈ అర్థాన్ని వాడుకుంటూ సాధువు హెచ్చరికను ఉదయనిధి తేలిగ్గా తీసిపారేశారు. ఇలాంటి బెదిరింపులు తమ కుటుంబానికి కొత్తేంకాదన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ మళ్లీ అదే చెబుతానని స్పష్టం చేశారు. ఈమేరకు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ సాధువుకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉదయనిధి ప్రశ్నించారు.