హైదరాబాదులో ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ ను ప్రారంభించిన కేటీఆర్

స్విట్జర్లాండ్ కు చెందిన సంతానసాఫల్య వైద్యచికిత్స, ప్రసూతి ఆరోగ్య మందుల ఉత్పత్తి సంస్థ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ హైదరాబాదులో ప్రారంభమైంది. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. రూ.246 కోట్లతో స్విస్ సంస్థ తాజా ల్యాబరేటరీని ఏర్పాటు చేసింది.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 30 బిలియన్‌ యూరోలతో ఫెర్రింగ్‌ కంపెనీ ఏర్పాటయిందన్నారు. టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని కేటీఆర్ తెలిపారు. స్విట్జర్లాండ్‌ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని వెల్లడించారు. పునరుత్పాదక ఔషధాల రంగంలోనూ, ప్రసూతి సంబంధిత ఆరోగ్య రంగంలోనూ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ హైదరాబాదులో భారీ పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.