హైకోర్టు లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.

కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డి తరఫున వైస్సార్సీపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని తనకు వంద కోట్ల ఆఫర్ ఇచ్చారని రోహిత్ రెడ్డి ధర్మాసనానికి చెప్పింది. ఆఫర్ చేశారే తప్ప డబ్బు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆర్థిక వావాదేవీలు జరగనందున కేసు ఈడీ పరిధిలోకి రాదని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ వాదించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని ఆరోపించారు.

మరోవైపు మంగళవారం విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా ఆయన గైర్హాజరయ్యారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ నెల 30న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపినట్లు ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇదిలా ఉంటె కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించడాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తప్పుబట్టారు. సిట్ దర్యాఫ్తు సజావుగా సాగుతుండగా కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బిజెపి కొత్త కుట్రలకు తెరలేపింది అని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దింపి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపి ఎన్ని కుట్రలు చేసినా తాను మాత్రం తగ్గేది లేదని రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.