రవితేజ గురించి చెప్పలేకపోయా..అంటూ చిరు ఎమోషనల్ ట్వీట్

చిరంజీవి – శృతి హాసన్ జంటగా రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం వాల్తేర్ వీరయ్య. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా మంగళవారం చిత్ర ప్రెస్ మీట్ ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్రంలో నటించిన నటి నటులు హాజరయ్యారు.

ఈ ప్రెస్ మీట్‌లో చిరంజీవి తన యూనిట్ సభ్యులందరి గురించి మాట్లాడి ..రవితేజ గురించి మాట్లాడడం మరచిపోయారు. ప్రెస్ మీట్ తర్వాత ఆ విషయం తెలుసుకొన్న చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘వాల్తేరు వీరయ్య’ టీం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం వాళ్ల అనుభూతులను పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినంత సంతృప్తిగా అనిపించింది. అయితే, సినిమా విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలనుకుని, నా తమ్ముడి (రవితేజ) గురించి మాట్లాడటం మర్చిపోయా. ప్రెస్ మీట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ విషయం తెలిసి వెలితిగా ఫీలయ్యా.

అందుకే ఇప్పుడు ఈ ట్వీట్ చేస్తున్నా. వాల్తేరు వీరయ్య ప్రాజెక్ట్ గురించి చెప్పగానే.. నాతో సినిమా చేయాలని రవి వెంటనే ఒప్పుకున్నాడు. సెట్ లో కలిసి పనిచేసిన ప్రతిరోజు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం. రవితేజతో మళ్లీ ఇన్నేళ్లకు కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, రవితేజ సినిమా చేయకపోయుంటే.. వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అన్నట్లు పూనకాలు తెప్పించడంలో రవితేజ పాత్ర చాలా ఉంది. ఈ విషయాలన్నీ త్వరలో మాట్లాడుకుందాం’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.