సాహితీవనంలో మకుటంలేని మహారాజు మధునాపంతుల

తె లుగు సాహిత్యంలో అవిరళకృషి చేసిన కవ్ఞలలో అగ్రగణ్యులుగా పేర్కొన దగిన వారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు. వీరుతెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుగులో అద్భుతమైన రచనలు చేసి వాటి సుంగధపరిమళాల్ని సాహితీ వినీలాకాశంలో వెదజల్లి వాటి పరిమళాల్ని శాశ్వతం చేశారు. ఆయన రచనలు ఎంత పరిమళంగా ఉంటాయో ఆయన హృదయం అంతకు మించిన నవనీత సదృశ్యం. ఆయన వాక్కులో మృధుత్వం. ఆయన పేరు సత్యనారాయణశాస్త్రి. తన పేరుకు తగ్గట్టుగా ఆయన పలికేది ఎప్పుడు సత్యవాక్కులే. ఆధునిక యోగుల్లో ఆయన ఓ సారస్వతయోగి. వీరి రచనలు ఆధునికత, ప్రాచీనత రెండింటి మేలు కలయికతో అద్భుతంగా ఉంటాయి. ఈయన మితభాషి, హితభాషి కూడా. ఈ ఆంధ్ర కల్హాణ, కళాప్రపూర్ణ బిరుదాంకితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు 1920, మార్చి 5వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పోలవరం గ్రామంలో సత్యనారాయణ మూర్తి, లచ్చమ్మ పుణ్యదంపతుల ఇంటజన్మించారు. వీరి బాల్యం పల్లెపాలెం గ్రామంలో గడించింది. వీరు విజయనగరం సంస్కృత కళాశాలలో చేరి మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుండగా 35 రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడి మధ్యలో చదువ్ఞ ఆపారు. మధునాపంతుల వారికి అతిపిన్న వయస్సు నుండే సాహిత్యం మీద అపారమైన మక్కువ ఉండేది. ఆ మక్కువతోనే 10 ఏళ్ల వయస్సు నుండే పద్యాలు రాయడం మొదలు పెట్టారు. 1938లో వీరి తొలి ఖండకావ్యం తోరణం వెలువడింది. దీనికి విశ్వనాథ సత్యనారాయణ గారు పీఠిక రాస్తూ శాస్త్రి మహాకవి అయ్యే సూచనలు ఈ పద్యాలలో గోచరిస్తున్నాయని అద్భుతంగా ప్రసంశించారు. ఈయన 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్‌ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. 1949-44ల మధ్య కాలంలో సూర్యరామాంధ్ర నిఘంటువ్ఞ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చేరి తెలుగు పండితునిగా చాలా కాలం విద్యార్థులకు పాఠాలు బోధించారు. శాస్త్రిగారు తన మేనత్త భర్త అయిన మామయ్య గోరేటి వెంకట రామకృష్ణ శాస్త్రిగారి దగ్గర పద్యరచనల్లో చక్కటి తర్ఫీదు పొంది మంచి సాహిత్య పాండిత్యం సంపాదించారు. ఈ జ్ఞాన సముపార్జనతో 20 సంవత్సరాలకే ఆంధ్ర అనే పేరుతో చక్కని విలువలతో కూడిన సాహిత్య మాసపత్రికను మూడు సంవత్సరాలు విజయవంతంగా నడిపారు. ఈ పత్రిక అలనాటి పండితుల, పరిశోధకుల అభిమానాన్ని చూరగొంది. ఈ పత్రికలో ముద్రింపబడ్డ ప్రతి వ్యాసానికి, కవితకు శాస్త్రిగారు చక్కని విశ్లేషణ ఇచ్చేవారు. ఈ ఆంధ్రపత్రికలో 19-20 శతాబ్దపు తెలుగు రచయితల గురించి చక్కని వ్యాసాలు ప్రచురించేవారు. ఇందులో 19వ శతాబ్దానికి చెందిన పరావస్తు చిన్నయ్య సూరి దగ్గరి నుండి తుమ్మల సీతారామ చౌదరి వరకు ఉన్న ప్రసిద్ధకవ్ఞలందరి గురించి ఎంతో వివరంగా రాశారు. ఆ తర్వాత కవ్ఞలందర్ని ఒక తాటిమీదకు తెచ్చే నేపథ్యంలో ఆంధ్ర రచయితలు అనే కావ్యంగా మలిచారు. ఇందులో నీతిచంద్రిక, బాలవ్యాకరణం రచించిన చిన్నయ్యసూరి మొదలుకొని నూరుగురి మహాకవ్ఞల గురించి సద్విమర్శతో చక్కని గ్రంథంగా మలిచారు. 2012 డిసెంబర్‌లో ఈ గ్రంథాన్ని శాస్త్రిగారి కుమారుడు మధునామూర్తి చిన్న చిన్న మార్పులు చేసి నూతనంగా మరో 13 మంది రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాద్‌లోనూ ఆవిష్కరించారు. ఈ గ్రంథం గురించి మల్లంపల్లి శరభేశ్వరశర్మ గారు ఇది మూడు ఖండకావ్యముల చరిత్ర అని ప్రశంసించారు. ఇంకా విశ్వనాథ సత్యనారాయణగారి తర్వాత అంతటి పాండిత్యం, అంతటి కవితాసక్తి ఉన్న మహాకవి మధునాపంతులవారు అని మల్లంపల్లివారు అభివర్ణించారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రజాతి చరిత్రను పురాణంగా మలచడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆంధ్రజాతి పుట్టుక మొదలు తంజావూరు నాయకుల కాలం వరకు తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర రెండింటి అవినాభవ సంబంధంతో చివరి వరకు 9 పర్వాలతో రచించిన అద్భుతమైన కావ్యము ‘ఆంధ్రాపురాణము ప్రతి తెలుగు వారి లోగిళ్లలో తప్పక ఉండవలసిన మహాగ్రంథం. నీవ్ఞ ఎవరు? నీ ప్రాచీనత ఏమిటని అడిగితే చెప్పడానికి వినిపించడానికి వీలైనటువంటి మహాగ్రంథమే ‘ఆంధ్రా పురాణము. ఆంధ్ర అంటే ఇప్పుడున్న ఆంధ్ర కాదండి. ఇంతకు ముందున్నటువంటి విశాలాంధ్రప్రదేశ్‌. తంజావూరు దాకా వ్ఞండే ఆంధ్రదేశం చరిత్ర ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ కృతికిగాను వీరికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి అవార్డు లభించింది. వీరి మరో అందమైన కావ్యం చరిత్ర ధన్యులు. దీనిలో చరిత్రలో వివిధ రంగాలలో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల వారు రాసిన ప్రసిద్ధ గ్రంథం. ఇందులో శాలివాహనుడు, మాధవవర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించారు. శాలివాహ నుండి సాహిత్యకృషిని, మాధవవర్మ రాజకీయ చతురతని, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మికతత్వం ఇందులో ఎంతో అందంగా మలచి పొందుపరిచారు. ఇంకా వీరు కన్యాకుమారులులో అరుణోదయం అనే ఖండిక రాశారు. తెలుగు భాషలో ఓ అద్భుతమైన ఖండకావ్యంగా దీనిని అభివర్ణించవచ్చు. ఇంకా వీరు తోరణములు, శ్రీఖడ్గములు, చైత్రరథం, కేళాకుళి లాంటి ఎన్నో ప్రముఖ కావ్యాలు రాశారు. అలాగే వీరు నవలలు, కథలు, చరిత్రలు నాటకానువాదాలు, వ్యాసాలు ఇలా అన్ని ప్రక్రియలో అద్భుతమైన రచనలు చేసి సాహితీప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే బోధవృక్షము, బుద్ధుని చరిత్ర ఆధారంగా రాయబడిన నవల కళ్యాణతారక. ఇందులో కృష్ణదేవరాయులు కొండపల్లి ముట్టడి గురించిన ఇతివృత్తంతో రాశారు. ఇంకావీరు పతంజలి చరిత్ర, ధన్వంతరి చరిత్ర, షడ్దర్శన సంగ్రహం లాంటి మరపురాని మధురమైన రచనలు చేసి సాహితీ వినీలాకాశంలో మకుటం లేని మహరాజులా వెలిగారు. ఈ అభినవ నన్నయ, సాహితీ దిగ్గజం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు 1992 నవంబర్‌ 7న రాజమండ్రిలో పరమపదించారు. డాII మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి శతజయంతి ఉత్సవ సంఘం హైదరాబాద్‌వారు, అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు వారు సంయుక్తంగా గుంటూరులో శతజయంతి ఉత్సవాలు జరపడం ఎంతయినా ముదావహం.

  • పింగళి భాగ్యలక్ష్మి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/