మినీ మేనిఫెస్టోతోనే వైస్సార్సీపీ లో ప్రకంపనలు మొదలయ్యాయి – నారా లోకేష్

మినీ మేనిఫెస్టోతోనే వైస్సార్సీపీ లో ప్రకంపనలు మొదలయ్యాయని ఎద్దేవా చేసారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మహానాడు సందర్బంగా రెండు రోజుల పాటు యువగళం పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్..మంగళవారం తిరిగి ప్రారంభించారు.

111వ రోజు యువగళం పాదయాత్ర జమ్మలమడుగు శివారు బైపాస్ రోడ్డు నుంచి సాయంత్రం ప్రారంభమైంది. జమ్మలమడుగు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు పెద్దఎత్తున జనం హాజరుకావడంతో నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జమ్మలమడుగు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెదపసుపుల మోటు, సంజాముల మోటు, జమ్మలమడుగు పాతబస్టాండు, కన్నెలూరు క్రాస్, శేషారెడ్డిపల్లి మీదుగా దేవగుడి చేరుకుంది.

“మహానాడు మినీ మేనిఫెస్టోకే వైస్సార్సీపీ నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు. ఇక పూర్తి మేనిఫెస్టో వస్తే వైస్సార్సీపీ దుకాణం బంద్. హామీలు అన్ని ఎలా అమలు చేస్తారని వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు, పేటీఎం డాగ్స్ అన్ని రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నాయి. జగన్ అప్పుల అప్పారావు… మా చంద్రన్న సంపద సృష్టికర్త. జగన్ ది దొబ్బే గుణం… చంద్రన్న ది పెట్టే గుణం. జగన్ మోసగాడు… చంద్రన్న మొనగాడు. అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలుచేసి తీరుతారు. మీ కష్టాలు తెలుసుకున్న తరువాత మీ అన్న చంద్రన్న మహాశక్తి పథకం కింద పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు” అని వెల్లడించారు.