ద్రౌపదీ ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..

ముందు నుండి అంత భావించినట్లే భారత 15 వ రాష్ట్రపతి గా ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. జులై 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠం అధిరోహించనున్నారు.

ద్రౌపదీ ముర్ము విజయం సాధించడం తో ప్రధాని మోడీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు అందజేశారు. ముర్ము కు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్చం అందజేశారు. అలాగే యశ్వంత్​ సిన్హా కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ద్రౌపదీ ముర్ము కు మద్దతు తెలిపిన పార్టీలు సైతం ఆనందంలో ఉన్నాయి.

అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ముర్ము తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. 2007 నుంచి 2012 వరు ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతిగా సేవలందించగా.. అత్యున్నత పదవి అధిరోహించనున్న ద్రౌపది ముర్ము 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. 1958 జూన్ 20వ తేదీన ఒడిశాలోని మయూర్‌ భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసి తెగకు చెందినవారు. ఈ తెగ వందల ఏళ్లుగా మనదేశంలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అంతేకాదు.. సంతాల్ తెగ వీరులను భారతదేశ మొదటి స్వాతంత్ర్య పోరాట యోధులుగా కూడా పిలుస్తారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశ రాష్ట్రపతి అవడం విశేషం.