జగన్‌ ఏం చెబితే అది చేసేందుకు సిద్ధం..చంద్రబాబు

వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. ఒక్క నిమిషంలో మేమంతా కూడా రాజీనామా చేస్తాం.. చంద్రబాబు

అమరావతి: విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే ఆలోచనను వ్యతిరేకించే పక్షంలో అధికార వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, తాము ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, ఈ విషయంలో తాను సీనియర్ నేతననే అహం లేకుండా ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ముందుకు వస్తానని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఏం చెబితే, అది చేస్తానని, ఈ విషయంలో అధిక బాధ్యత తనపైనే ఉందని జగన్ గుర్తించాలని సూచించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఒక వ్యక్తికి కాదని ప్రభుత్వానికని, ఆ ప్రభుత్వానికి ప్రజల సెంటిమెంట్‌, హక్కులను కాపాడవలసిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.


విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు ఊపిరి పోశాడని, ఆ స్ఫూర్తితో సంఘటితంగా పోరాడి స్టీల్‌ప్లాంటును కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రజల ఆత్మ అని, దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు. ఖమీరు ఉద్యమానికి ఊపిరిచ్చారు. దాన్ని కొనసాగించే బాధ్యత మేమంతా తీసుకుంటాం. తప్పకుండా పోరాడతాంగ అని పల్లాను ఉద్దేశించి అన్నారు. 18న స్టీల్‌ప్లాంట్‌ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సమైక్యంగా పోరాడతామని, ఐదు కోట్ల మందిని ఉద్యమంలోకి సమీకరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖపట్నం ఉనికే లేదని ధ్వజమెత్తారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/