రేపు తిరుమలకు సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తిరుమలకు వెళ్లనున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అంకురార్పణ జరిగింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఏకాంతంగానే సేవలు నిర్వహించారు.. అందుకే ఈ సారి సామన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రత్యేక, బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సిఫార్సు లేఖలు కూడా అనుమంతించడం లేదు. మరోవైసు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఏపి డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి పరిశీలించారు.. ఇవాళ సాయంత్రం తిరుమాఢ వీధులతో పాటుగా ఆలయ పరిసరాలు, రింగురోడ్డును పోలీసు అధికారులతో‌ కలిసి పరిశీలించిన ఆయన భధ్రత పరమైన సలహాలు, సూచనలను అధికారులకు ఇచ్చారు..

సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీఎం జగన్ బయలుదేరి.. సాయంత్రం 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుని.. సాయంత్రం 5.20 గంటలకు తాతయ్యగుంట గంగమ్మ దర్శనం చేసుకుంటారు. తర్వాత అలిపిరి చేరుకుని అక్కడ ఆర్టీసీ డిపో నుంచీ తిరుమలకు ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభిస్తారు. అనంతరం తిరుమల వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పెద్ద శేష వాహనోత్సవంలో పాల్గొంటారు. మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం వేకువ జామున మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, లక్ష్మీ వి.పి.ఆర్‌ విశ్రాంతి గృహాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.45 గంటలకల్లా విమానాశ్రయం చేరుకుని విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వెళ్తారు.