కార్యకర్తలకు, పార్టీ యోధులకు నమస్కరిస్తున్నా..లోకేశ్‌

అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల్లో టిడిపికి విజయాన్ని సాధించిపెట్టిన కార్యకర్తలకు, పార్టీ కోసం పోరాడిన యోధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. గాలి హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ఫేక్ పార్టీకి ఒక్క చాన్స్, చివ‌రి చాన్స్ అని ప్ర‌జ‌లు స్థానిక ఎన్నిక‌ల ద్వారా తీర్పునిచ్చారన్నారు. ‘వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి.. జ‌నం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?’ అని ప్రశ్నించారు.

స్వేచ్ఛ‌గా ఎన్నిక‌లు జ‌రిగితే జ‌నంలో ఉన్న వ్య‌తిరేక‌త బ‌య‌ట‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్‌రెడ్డి రాజ్యాంగ‌వ్య‌వ‌స్థ‌ల‌పై దాడికి తెగ‌బ‌డ్డారని ఆయన ట్వీట్ చేశారు. న్యాయ‌స్థానాల చొర‌వ‌తో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగాయన్నారు. ‘అధికార‌యంత్రాంగం‌, పోలీసుల్ని వాడుకుని వైఎస్‌ఆర్‌సిపి వాళ్లు హ‌త్య‌లు చేశారు, కిడ్నాప్‌ల‌కు పాల్ప‌డ్డారు, నామినేష‌న్ ప‌త్రాలు చించేశారు, ఆస్తులు త‌గుల‌బెట్టారు, ప్ర‌లోభాల‌తో ఏక‌గ్రీవాలు చేసుకున్నారు. ఇన్ని చేసినా ఎదురొడ్డి నిలిచి గెలిచారు టిడిపి యోధుల‌కు, కార్యకర్తలు’అని లోకేశ్ పేర్కొన్నారు.