వైసీపీ ప్లీనరీ సందర్బంగా గుంటూరు జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల రాకపోకల నిలిపివేత ..

రేపు , ఎల్లుండి వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. కోల్‌కతా- చెన్నై జాతీయ ర‌హ‌దారి ఆనుకుని స‌మావేశాలు జరగనున్న నేపథ్యంలో జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల రాక‌పోక‌ల‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో విజ‌య‌వాడ, గుంటూరు మ‌ధ్య జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతి రాణా టాటా, గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్ర‌మ్ వ‌ర్మ తెలిపారు. ప్లీన‌రీ జ‌రిగే రెండు రోజులూ ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల‌కు అనుమ‌తి లేద‌ని వారు తెలిపారు.

గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు క్రాస్ రోడ్డు మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరడి వారధి మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ – పామర్రు – అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల – త్రోవగుంట మీదుగా మళ్లిస్తారు.

విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు – మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లిస్తారు.

చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ వైపు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలను ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద దారి మళ్లిస్తారు. త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు వాహనాలను మళ్లిస్తారు.

హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే లారీలు, భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి.కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి అనుమతిస్తారు.

విజయవాడ వైపు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సుల కోసం కాజా టోల్ ప్లాజా వద్ద RK వెనుజుల లేఅవుట్‌లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే కార్లు, టూవీలర్లను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఇక గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులను నంబూరు & కంతెరు రోడ్డు వద్ద.. కార్లు, టూవీలర్లను కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్ & రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ చేసేలా ఏర్పాటు చేశారు.