హైదరాబాద్‌లో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది

ఉద్యోగాల పేరుతో యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం.. బోర్డులు తిప్పేయడం ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కువై పోయాయి. ఇప్పటికే పలు కంపెనీలు బోర్డు తిప్పేయగా, తాజాగా మరో కంపెనీ బోర్డు తిప్పేసి , 700 మందిని రోడ్డున పడేసింది. హైదరాబాద్‌లో డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగాల పేరుతో యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఆన్‌లైన్ జాబ్..వర్క్ ఫ్రం హెం, యూఎస్‌ బేసిడ్ కంపెనీ అంటూ చీటింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నెలకు మూడు లక్షల పైనే జీతం ఇస్తామని ఆశ చూపి..ఐదు లక్షల యాభై వేలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని చెప్పి వారిని బురిడీ కొట్టించింది.

700 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల మేర డిపాజిట్ కట్టించుకుని డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు ఎత్తేసింది. దీంతో బాధితులంతా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలనీ పోలీసులు సూచించారు. మరోవైపు మోసపోయిన యువత మాత్రం కన్నీరుమున్నీరవుతోంది. ఉద్యోగం కల్పిస్తామని నమ్మించారని అందుకే భారీగా సొమ్ము ముట్టజెప్పామని వారంతా వాపోతున్నారు.