కన్నబాబు ఆగ్రహం..వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించిన ఎమ్మెల్యే

అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ

ysrcp-mla-kannababu-raju-slapped-one-of-the-locals

అమరావతిః ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళుతున్న వైఎస్‌ఆర్‌సిపి ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు తాజాగా స్థానికులు, సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ ఎదురైంది. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎమ్మెల్యే కన్నబాబును సొంత పార్టీ నేతలు తమ సమస్యలకు పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ పరిణామం కన్నబాబుకు ఆగ్రహం తెప్పించింది. నన్నే నిలదీస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించారు.

గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సదరు వ్యక్తి నలుగురిలో గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లకు వచ్చి స్థానికంగా ఏం జరుగుతోందని అడుగుతున్నారా? అని అతడు నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించినట్టు తెలిసింది. కన్నబాబు తీరుపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులతో పాటూ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి కానీ దురుసుగా ప్రవర్తించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, స్థానిక వైఎస్‌ఆర్‌సిపి పార్టీ నేతల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

కాగా, గతంలోనూ ఓ మారు ఓ యువకుడిపై ఎమ్మెల్యే కన్నబాబు చేయిచేసుకున్నారన్న ఉదంతం చర్చనీయాంశమైంది.