21న ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల బాధ్యతలు

ys-sharmila

అమరావతి : ఏపి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్‌ షర్మిల ఈనెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాణిక్కం ఠాకూర్‌ , మయప్పన్‌తో పాటు ఏపీకి చెందిన సీనియర్‌ నాయకులు హాజరు కానున్నారు. ఏపీ లో త్వరలో ఎన్నికలు జరుగనున్న సమయంలో షర్మిలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రం వీడిపోయిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌ ఘోరంగా ఓటమి పాలయ్యింది. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి 102 సీట్లతో అధికారంలోకి రాగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి కి 70 సీట్లు వచ్చాయి.

కాగా, 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది . టిడిపి 23 సీట్లు రాగా జనసేన ఒక స్థానం నుంచి గెలుపొందింది. ఈసారి అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతో జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణ వైఎస్సార్‌ పార్టీని స్థాపించి తెలంగాణలో ప్రచారం చేసుకున్న షర్మిల ఏ ఎన్నికల్లో పోటి చేయకుండానే ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన 15 రోజుల్లో ఏపీకి చీఫ్‌గా నియమించడం రాజకీయంగా సంచలనం కలిగించింది .