రంగంలోకి దిగి దిగగానే వైసీపీ – టీడీపీ ఫై నిప్పులు చెరిగిన షర్మిల

వైస్ షర్మిల ఈరోజు AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టింది. ఈ బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ , ప్రతిపక్ష పార్టీలు టీడీపీ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా వైసీపీ అధినేత , తన అన్న జగన్ ఫై విమర్శలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని పరిపాలించినా ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి‌లో వైసీపీ సర్కార్ ఉందని షర్మిల మండిపడ్డారు.

ఏపీకి రూ.పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని షర్మిల ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మైనింగ్‌ మాఫీయాలు రెచ్చిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అభివృద్ధి చేస్తామని రాష్ట్రంలో ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో పార్టీలు విఫలం అయ్యాయని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకువస్తామని షర్మిల ప్రకటించారు.

అంతకు ముందు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ విజయవాడలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల రోడ్డు మార్గంలో కడపకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు. నిడమానూరులో షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. షర్మిలతో పాటు మరో నాలుగు వాహనాలను మాత్రమే రామవరప్పాడు మీదుగా పంపించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాన్వాయ్‌ను మధ్యలోనే నిలిపివేశారు షర్మిల. కారులో నుంచే షర్మిల మీడియాతో మాట్లాడారు. భయపడుతున్నారా సర్? అని ఆమె అనడం గమనార్హం. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తమ కాన్వాయ్‌ను దారి మళ్లించారని తెలిపారు.