అయోధ్య రామమందిరానికి ‘హనుమాన్’ యూనిట్ భారీ విరాళం

తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ కలయికలో సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హనుమాన్. ప్రీమియర్ షో తోనే బ్లాక్ బస్టర్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. హనుమాన్ దెబ్బకు గుంటూరు కారం, నాసామిరంగ, సైంధవ్ వంటి అగ్ర హీరోల చిత్రాలు కనిపించకుండా పోయాయి. హనుమాన్ కు వెళ్లి..ఆ సినిమా టికెట్స్ దొరక్కపోతే ఈ సినిమాలకు వెళ్తున్నారంటే అర్ధం చేసుకోవాలి సినిమా ఏ రేంజ్ లో మౌత్ టాక్ సొంతం చేసుకుందో..

ఇక ఈ సినిమా విడుదలకు ముందే మేకర్స్..ఈ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర‌యూనిట్ ప్రకటించారు. ప్రకటించినట్లే ఆ విరాళాన్ని రామ మందిరానికి పంపిస్తున్నారు. ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను విరాళంగా అందించింది. తాజాగా 9 రోజుల‌కు గాను ఇప్పటి వరకూ 53,28,211 హ‌నుమాన్ టికెట్లు అమ్ముడు అయ్యాయి. అయితే ఈ టికెట్ల ద్వారా వ‌చ్చిన మొత్తం రూ.2,66,41,055 ల‌ను రామమందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి ‘హనుమాన్‌ ఫర్‌ శ్రీరామ్‌’ అని పేర్కొంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఇదిలావుంటే సినిమా ప్రేమికులకు మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయోధ్యలో నిర్మించిన రామ‌మందిరంలో (Ayodhya Ram Mandir) శ్రీరాముడు కొలువుదీరనున్న సంద‌ర్భంగా.. హ‌నుమాన్ సినిమాపై ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రామ్ లల్లా ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22 నాడు ఈ సినిమాకు ‘బై వన్‌.. గెట్‌ వన్ (ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘MIRAJBOGO’ అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫ‌ర్ ఒక్కరోజు మాత్రమే అని పేర్కొంది.