బీజేపీకి బుర్రలేదన్న షర్మిల..

ys-sharmila

బిజెపి తీసుకొచ్చిన అగ్నిపథ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అగ్గి పుట్టిస్తుంది. ఈ పధకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఆర్మీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను టార్గెట్ చేసుకొని విధ్వసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది నష్టం చేసిన ఆందోళనకారులు..ఇంకా తీవ్రతరం చేస్తున్నారు. ఇక నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు బీబత్సం సృష్టించారు. ఈ బీబత్సహాన్ని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా , అందులో ఓ యువకుడు మృతి చెందాడు.

ఇక ఈ అగ్నిపథ్ ఫై ఇప్పటికే రాజకీయపార్టీలు నిప్పులు చెరుగగా..తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. బీజేపీ బుర్రలేని నిర్ణయాలు దేశంలో అలజడులకు కారణమవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో దామెర రాకేష్ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ నియామకాలకు అగ్నిపథ్ అగ్గిపెట్టిందని, ఆగ్రహ జ్వాలలు దేశాన్ని కాల్చేస్తున్నాయన తెలిపారు.

అయినప్పటికీ తగ్గేదేలేదంటూ నియామకాలు చేస్తామని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ మోదీ సర్కారు మొండిగా పోతోందని షర్మిల మండిపడ్డారు. అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయినందున, మరిన్ని అల్లర్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.