తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాగా ఈ బడ్జెట్ ఫై YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు.

‘‘మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్‎కి వెళ్లారు. అందులో ఆయన మామ పాత సారా పోశారు’’ అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమాధానం చెప్పాలని తన పాదయాత్ర లో షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని, గతేడాది బడ్జెట్‎ను కాపీ పేస్ట్ చేశారని, ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. అసలు కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. పథకాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టకపోతే ఎందుకని నిలదీశారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం ఇచ్చిన మాటకు విలువ ఉండదా? అని ప్రశ్నించారు.

ప్రస్తుతం షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర 229వ రోజు తూర్పు వరంగల్ నియోజకవర్గం నుంచి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది.