కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులేనన్న పేర్ని నాని

కృష్ఱా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ భూమిని వైస్సార్సీపీ పార్టీ ఆఫీస్ కు కేటాయించడంపై వివాదం కొనసాగుతోంది. సోమవారం నాడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. పార్టీ నేతలతో కలిసి నిరసనకు దిగడం, స్థల పరిశీలనకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వైస్సార్సీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని‌ దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ‘‘రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని ప్లాన్ చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీస్‌కి ఇస్తారు? అది పేర్ని నాని కష్టమా, ఆయన తండ్రి కష్టమా? చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో దీనిపై పేర్ని నాని స్పందించారు. కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులేనని నాని విమర్శించారు. బందరులో రవీంద్ర నటన ముందు కమలహాసన్, ఎస్వీ రంగారావు కూడా దిగదుడుపేనని ఎద్దేవా చేశారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులపై ఆయన దాడి చేశారని, సానుభూతి రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

‘‘ప్రభుత్వ ఆస్తులపై ముందు కన్నేసింది ఎవరు? హైదరాబాద్ నడిబొడ్డున టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా? మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలం ఎవరిది? ప్రభుత్వానిది కాదా?’’ అని ప్రశ్నించారు. అసత్యాలు.. మోసాలు.. డ్రామాలు చేసే జన్మ అవసరమా? అని విమర్శించారు. మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయానికి 50 సెంట్ల ప్రభుత్వ భూమి లీజుకి ఇవ్వమని అడిగింది రవీంద్ర కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయానికి స్థలం అడిగి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.