వైద్య చికిత్స కోసం బెయిల్ పై విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి

12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు

YS Bhaskar Reddy released on escort bail over ill health

హైదరాబాద్‌ః వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యారు. వైద్య చికిత్స కోసం సీబీఐ కోర్టు ఆయనకు 12 రోజుల పాటు బెయిల్ ను మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నట్టు చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, సీబీఐ జడ్జి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ మంజూరు చేస్తూ గత బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి.

హైదరాబాద్ ను వీడి వెళ్లరాదని, హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని బెయిల్ షరతుల్లో కోర్టు పేర్కొంది. తిరిగి అక్టోబర్ 3న చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండ్ అవ్వాలని వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఎస్కార్ట్ బెయిల్ కింద 12 రోజుల పాటు ముగ్గురు పోలీసులు వైఎస్ భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు.