నేడు విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని వివరణ

ys-avinash-reddy

అమరావతిః వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులపై ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందించారు. ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని, ప్రస్తుతం తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు. ఈ కేసులో విచారణకు అధికారులకు తాను సహకరిస్తానని ఎంపీ స్పష్టం చేశారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని ఆ లేఖలో వివరించారు. ఒక రోజు ముందు నోటీసులు పంపి, విచారణకు రమ్మంటే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.

ఏపీ మాజీ మంత్రి, దివంగత నేత వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సోమవారం సీబీఐ అధికారులు కడప, పులివెందులకు వెళ్లారు. ఎంపీ అవినాశ్ రెడ్డి కార్యాలయంతో పాటు ఆయన తండ్రి భాస్కర్ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఎంపీ అవినాశ్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఎంపీ అవినాశ్ లేఖ రాయడంతో సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/