ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కి నిజమైన వృత్తి వారసుడు చిరంజీవే – ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ

విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్వహించిన ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్వర్యంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కి నిజమైన వృత్తి వారసుడు మెగాస్టార్ చిరంజీవియే అని పేర్కొన్నారు. చిరంజీవి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ప్రశంసలు కురిపించారు. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలని అంకురార్పణ చేసింది మాత్రం ఎన్టీఆరే అని గుర్తుచేశారు. ఇక, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నాను అన్నారు. సమకాలీన రచయితలలో యండమూరికి ఎవరూ సాటిలేర్న ఆయన.. నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు.. యండమూరి అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యానని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు.. వారితో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతం.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనుభవాలు మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు.