విరిగిపడిన కొండచరియలు..లోయలోపడ్డ మినీ ట్రక్కు

tempo-vehicle-overturns-while-trying-to-cross-a-road-full-of-debris-due-to-a-landslide-in-uttarakhand

డెహ్రాడూన్: హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఃగంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారులపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమునోత్రి హైవేలోని ఝర్‌ఝర్‌ గాడ్‌ సమీపంలో ఈరోజు ఉదయం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

హైవేపై పడిన బండరాళ్లను స్థానిక అధికారులు జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. అయితే అంతకుముందు ఆ ప్రాంతంలో కొండచరియలు కొద్దిగా విరిగిపడి రోడ్డుపై సగం వరకు బండరాళ్లు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన ఓ మినీ ట్రక్కు డ్రైవర్‌ ఆ బండరాళ్ల పక్క నుంచే అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పుడే అదే ప్రదేశంలో మరిన్ని బండరాళ్లు జారిపడటంతో వాటి తాకిడికి ట్రక్కు ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది.

ఘటనకు కొద్ది క్షణాల ముందు ట్రక్కు డ్రైవర్‌ కిందకు దూకి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఉత్తరకాశీ జిల్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేసి మీడియాకు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.