యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు సరిగాలేవని భక్తుల ఆగ్రహం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. నేటి నుండి మార్చి 3 వరకు అంటే 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ రూ. కోటి 50 లక్షలు ఖర్చుపెట్టింది. అయితే అంత డబ్బు పెట్టిన ఎక్కడ సరైన సౌకర్యం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైటింగ్ కోసం కేవలం11 రోజులకు 48 లక్షలు కేటాయించారు. అయితే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన కూడా లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. అంతే కాదు ప్రధాన రహదారులపై హోర్డింగులు పెట్టాల్సి ఉండగా పాతగుట్ట చౌరస్తాలో ఇప్పటివరకు ఎలాంటి హోర్డింగ్ లు పెట్టలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఏర్పాట్లు చేయాలనీ కోరుతున్నారు.

మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహమూర్తితోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 1955లో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను 11 రోజులపాటు నిర్వహించారు. అంతకముందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. పునర్నిర్మాణం తర్వాత ఇలవైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.

గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. ప్రత్యేకంగా ఆలయ పరిసరాల్లో విద్యుద్దీపాలంకరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సుందరీకరించారు. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరుకల్యాణోత్సవం, మార్చి 1న రథోత్సవం, 2న చక్రతీర్థ స్నానం, 3వ తేదీన శతఘటాభిషేకం, డోలోత్సవాలతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.