టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్

సోమవారం కృష్ణా జిల్లా గన్నవరం లో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గన్నవరం కోర్టు టీడీపీ నేత పట్టాభి రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అలాగే పట్టాభితోపాటు మరో 10 మంది టీడీపీ నేతలకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. పట్టాభికి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించాలని జడ్జి ఆదేశించారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు.

సోమవారం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ, వైస్సార్సీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో టీడీపీ నేత పట్టాభిరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి, తదితరులపై గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. పట్టాభి, తదితరులు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని ఫిర్యాదు దాఖలైంది. తనను కులం పేరుతో దూషించారని సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఏ1గా పట్టాభి, ఏ2గా దొంతు చిన్నా, ఇంకా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు.

ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ముసుగులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన జడ్జికి తెలిపారు. అరగంటపాటు కాళ్లు, చేతులపై కొట్టినట్లు ఆయన కోర్టులో తెలిపారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి తాజా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభి ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పట్టాభి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు.