మహిళల వస్త్రధారణపై నోరు జారిన రాందేవ్ బాబా వ్యాఖ్యలు

Baba Ramdev
Baba Ramdev

ముంబయిః యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సహా పలువురు మహిళలు హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

సమయాభావం వల్ల యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు వాటిని మార్చుకునే సమయం లభించలేదు. దీనిపై స్పందించిన రాందేవ్ బాబా.. ఇంటికెళ్లాక దుస్తులు మార్చుకోవచ్చని అంటూనే.. మహిళలు చీరలు, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారని అన్నారు. అక్కడితో ఆగక.. తన కళ్లకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించి వివాదం రాజేశారు. అమృతా ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఎదుటే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాందేవ్ బాబా వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/