నేను భగత్‌సింగ్‌ అనుచరుడిని..దేశాన్ని రక్షించేందుకు 100 సార్లైనా జైలుకెళ్తా: కేజ్రీవాల్‌

Will go to jail 100 times to save country: Kejriwal

న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకునేందుకు జైలుకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. దేశం కోసం వందసార్లు జైలుకెళ్లాల్సి వచ్చినా వెళ్తా అంటూ వ్యాఖ్యానించారు. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో కేజ్రీవాల్‌ మాట్లాడారు. ‘నేను భగత్‌సింగ్‌ అనుచరుడిని. దేశాన్ని రక్షించేందుకు వందసార్లు జైలుకెళ్లాల్సి వచ్చినా.. నేను వెళ్తాను’ అని అన్నారు.

అంతేకాక.. జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వస్తాయని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ అన్నారు. ఇండియా కూటమికి 300 సీట్లకు ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేను అవినీతికి పాల్పడ్డానని వాళ్లు (బీజేపీ నేతలు) అంటున్నారు. కానీ సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. నేను అవినీతి చేస్తే ప్రపంచంలో ఇక ఎవరూ నిజాయతీపరులు మిగలరు. లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు దోచుకున్నారని అంటున్నారు. దాదాపు 500 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఒక్కపైసా అయినా స్వాధీనం చేసుకున్నారా..? వంద కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఉంటే.. తనిఖీల్లో బయటపడాలి కద. మరి ఏదీ.. ఆ వంద కోట్లు గాల్లో మాయమైపోయాయా.. ?’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

మరోవైపు లిక్కర్‌ పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్‌ మంజూరు చేసింది. ఇక జూన్‌ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.