చంద్రబాబు అబద్దాలు లై డికెక్టర్‌కూ దొరకవుః అంబటి

పవన్‌ను అంటే చంద్రబాబుకు నొప్పి కలుగుతుందని ఎద్దేవా

why-chandrababu-responding-about-bro-film-asks-ambati-rambabu

అమరావతిః చంద్రబాబు తనను పట్టుకొని ఆంబోతు రాంబాబు అంటున్నారని, అసలు ఆయనదే ఆంబోతులకు ఆవులను సరఫరా చేసిన చరిత్ర అని నిప్పులు చెరిగారు. నీటి పారుదల శాఖ మంత్రిగా తాను బ్రో సినిమా గురించి మాట్లాడటాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, కానీ తాను మూడు ప్రశ్నలు వేస్తే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం భారాన్ని కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదు? డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాటేమిటి? అని ప్రశ్నించారు. ఈ 3 ప్రశ్నలకు ఆయన ఒక్కసారి సమాధానం ఇవ్వలేదన్నారు.

ఇరిగేషన్ మీద తాను వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నానని, ఆంబోతు రాంబాబు అని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఎన్నో సినిమాలు చేశారని, వాటి గురించి తాను ఎప్పుడైనా మాట్లాడానా? అని ప్రశ్నించారు. కానీ బ్రో సినిమాలో తమపై విమర్శలు చేశాడు కాబట్టి.. మమ్మల్ని గిల్లాడు కాబట్టి మాట్లాడవలసి వచ్చిందన్నారు.

నీతి, నిజాయితీకి మారుపేరు గల వ్యక్తి ఎవరు? అని అడిగితే పవన్ కల్యాణ్ నేను ఉన్నానని ముందుకు వస్తారని, భగత్ సింగ్, చెగువేరా అంటారని, కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉందని చెబుతారని, కానీ ఆయనలో నిజాయితీ లేదన్నారు. వివాదం వచ్చింది కాబట్టి అడుగుతున్నానని… బ్రో సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పాలన్నారు. నిర్మాత కూడా తాను ఎంత ఇచ్చానో చెప్పాలన్నారు. వారాహి పైకి ఎక్కి పారదర్శకంగా ఉండాలని ఊగిపోయే పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ గురించి మాత్రం చెప్పడన్నారు. నిత్యం నిజాయితీ అంటూ ఊగిపోయే పవన్.. తాను మాత్రం నిజాయితీగా ఉండరన్నారు. తాను రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటానని పవన్ చెప్పారని అంటారని, మరి బ్రోకు ఎంత తీసుకున్నారో ఎందుకు చెప్పడం లేదన్నారు. ఇందులోని రహస్యం ఏమిటి.. ఏమిటా మతలబు? అని ప్రశ్నించారు. ఇదేనా నిజాయితీ అన్నారు.

చంద్రబాబు తన హయాంలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టును అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. తెలుగు గంగ డిశ్చార్జ్‌ను పెంచిన ఘనత వైఎస్‌ది అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ మాత్రమే రాయలసీమకు న్యాయం చేశారన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు నీరు ఇస్తానని చెప్పడం ఏమిటన్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. లై డిటెక్టర్ పెట్టినా అబద్దాలు దొరకని వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు మాత్రమే అన్నారు. చంద్రబాబు ఏమైనా చెబితే కొత్తవారు అందరూ నిజమే అనుకుంటారని, కానీ అన్నీ అబద్దాలే అన్నారు. పోలవరం నా బిడ్డ అని చంద్రబాబు అంటారని, ఏమైనా నువ్వు ఆ ప్రాజెక్టును కన్నావా? అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్నారు.

ఎన్టీఆర్ రాముడు, భీముడు సినిమాలో రాముడిని కొడితే భీముడికి దెబ్బ తగులుతుందని, అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీరు ఉందన్నారు. బ్రో సినిమాకు సంబంధించి పవన్‌ను తాను విమర్శిస్తే చంద్రబాబుకు నొప్పి కలుగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబూ! నీకెందుకయా బ్రో సినిమా గురించి.. తనను పవన్ గోకాడు కాబట్టి స్పందించానన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారన్నారు.