పెద్దలేమో ఇంటి నుంచి పనిచేస్తుంటే.. పిల్లలను స్కూల్ కు పంపిస్తారా?

కాలుష్యంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం

న్యూఢిల్లీ: ఢిల్లీ పొల్యూషన్ పై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఢిల్లీలో గాలి బాగు కావట్లేదని, ఆ విషయం గత కొన్ని వారాలుగా తీసుకుంటున్న చర్యలతో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. పాఠశాలలను పున:ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దలేమో ఇంటి నుంచి పనిచేస్తుంటే.. పిల్లలను స్కూల్ కు పంపిస్తారా? అని ఢిల్లీ సర్కారు, అధికారులపై మండిపడింది. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం కాలుష్యంపై విచారించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ను అమలు చేసి, స్కూళ్లను మూసేసినట్టు ప్రభుత్వం చెప్పిందని, కానీ, తమకు అది కనిపించడం లేదని జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు.

‘‘ప్రతి రోజూ అఫిడవిట్లు వేస్తూనే ఉన్నారు. నివేదికలు ఇస్తూనే ఉన్నారు. రోజూ ఏం జరుగుతోందో కమిటీలూ చర్చిస్తూనే ఉన్నాయి. సమయం వృథా అవడం తప్ప ఇప్పటిదాకా ఏం లాభం జరిగినట్టు? ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం పెరుగుతూనే ఉంది’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలంటించారు. మూడు నాలుగేళ్ల పిల్లలు స్కూలుకు పోతుంటే.. వారి తల్లిదండ్రులేమో ఇంటి నుంచి పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, స్కూలుకు వెళ్లడం వారి ఇష్టానికే వదిలేశామన్న ఢిల్లీ సర్కారు సమాధానానికి సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

‘‘వారి ఇష్టానికి వదిలేశామని చెబుతున్నారు. ఎవరు మాత్రం ఇంట్లో కూర్చుంటారు? మాకూ పిల్లలు, మనుమలు ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటో మాకూ తెలుసు. ఇప్పుడు మీరు చర్యలు తీసుకోకపోతే.. రేపు మేమే మీపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటలు టైం ఇస్తున్నాం’’ అని తేల్చి చెప్పారు.

పిల్లలు నడిరోడ్డులో బ్యానర్ లు పట్టుకుని ఎందుకు నిలబడుతున్నారంటూ ఢిల్లీ సర్కారును జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రచారం కోసమే పిల్లలున్నారా? అని మండిపడ్డారు. ఎవరూ వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరా? అని నిలదీశారు. అయితే, వారంతా సివిల్ డిఫెన్స్ వాలంటీర్లని ఢిల్లీ సర్కారు తరఫున వాదిస్తున్న అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ బదులిచ్చారు. వారికి కావాలంటే మరిన్ని రక్షణ కవచాలందిస్తామని కోర్టుకు చెప్పారు. ఆయన సమాధానంపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ‘‘మీరు టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎంత మంది టాస్క్ ఫోర్స్ సభ్యులున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మంది ఉన్నారు?’’ అని ప్రశ్నించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/