ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు ముంపు గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసారు. అనంతరం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. వరద తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు, భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో హెలికాప్టర్‌, భద్రాచలంలో మరో హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచుతామన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. శ్యాంపల్లి ఆర్‌ అండ్‌బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలన్నారు. ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలన్నారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.