సచిన్ పైలట్‌కు మద్దతు తెలిపిన అశోక్ గెహ్లాట్

పైలట్ తండ్రిపై బిజెపి ఆరోపణలను తిప్పికొట్టిన గెహ్లాట్

‘Whole Country Should Condemn’: Ashok Gehlot Shields Sachin Pilot From BJP’s Attack

జైపూర్‌ః రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతుగా మాట్లాడారు. ఇద్దరి మధ్యా నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి పైలట్ కు మద్దతుగా నిలిచారు. సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్ పై బిజెపి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ నేత, దివంగత ఎంపీ రాజేశ్ పైలట్ ను అవమానించడమంటే ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను అవమానించడమేనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. రాజేశ్ పైలట్ ఓ గొప్ప వీరుడంటూ ట్వీట్ చేశారు. కాగా, సచిన్ పైలట్ కు మద్ధతుగా గెహ్లాట్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చకు దారితీశాయి.

సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్.. ఇద్దరూ రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసిన వారే. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీని గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి సీటు విషయంలో వీరిద్దరి మధ్యా విభేదాలు మరింత పెరిగాయి. దీంతో ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కొనసాగుతున్నారు. అలాంటిది సచిన్ పైలట్ తండ్రిపై బీజేపీ చేసిన ఆరోపణలను గెహ్లాట్ ఖండించడంతో రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా సేవలందించిన రాజేశ్ పైలట్.. 1969 లో మిజోరంపై బాంబులు వేశాడని, సురేశ్ కల్మాడితో కలిసి ఆయన ఈ పని చేశాడని బిజెపి ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. సొంత భూభాగంపై దాడి చేసినందుకు ప్రతిఫలంగా రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీలను కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్లు ఇచ్చి గెలిపించుకుందని ఆరోపించారు. దీనిపై సచిన్ పైలట్ బుధవారం స్పందిస్తూ తన తండ్రి రాజేశ్ పైలట్ బాంబులు వేసింది నిజమేనని, అయితే, మిజోరంపై కాదు తూర్పు పాకిస్థాన్ భూభాగంపై దాడి చేశారని వివరణ ఇచ్చారు. తాజాగా అశోక్ గెహ్లాట్ కూడా ఈ విషయంలో పైలట్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.