వాట్సాప్​ ద్వారా బస్సు టికెట్లు.. వినూత్న కార్యక్రమానికి ఢిల్లీ సర్కార్‌ శ్రీకారం

WhatsApp-based bus ticketing system in Delhi soon

న్యూఢిల్లీః ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకురానుంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి వాట్సాప్‌ ద్వారా టికెట్లు జారీ చేసే అంశాన్ని ఆ సర్కార్ పరిశీలిస్తోంది. ఇప్పటికే దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఈ తరహా సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సేవలను బస్సు ప్రయాణికులకూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రయాణికులకు శుభవార్త చెబుతామని అక్కడి అధికారులు వెల్లడించారు.

ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వాట్సప్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది మే నెలలో కొన్ని మార్గాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించటంతో ఇప్పుడు బస్సుల్లోనూ విస్తరించేందుకు నడుం బిగించింది. అయితే, వాట్సాప్‌ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. వాట్సాప్‌ ద్వారా కొనుగోలు చేసిన టికెట్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రం ఉండదు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే చిన్న మొత్తంలో కన్వీనియెన్స్‌ ఫీజు కూడా వసూలు చేస్తారు. యూపీఐ ఆధారిత పేమెంట్స్‌కు మాత్రం ఎలాంటి అదనపు రుసుము ఉండదు.