తెలంగాణ లో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..తెలంగాణ సీఎం కేసీఆర్ ఫై ఘాటైన విమర్శలు చేసారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. లిక్కర్ స్కాం కేసు నుంచి బిడ్డను కాపాడేందుకు రాత్రింభవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కొంత మంది పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు బీజేపీ కార్యకర్తలు శ్రమించాలన్నారు.

బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గోడలపై ఉన్నారని…బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల గుండెల్లో ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలపైకి ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని..పోలీసు బందోబస్తు లేకుండా బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరగాలని సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై షర్మిల చేపట్టిన నిరసనలో ఆమెకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంపై షర్మిల తనకు ఫోన్ చేసిందని..ఆమెపై జరిగిన దాడిపై సంఘీభావం కూడా తెలిపానన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ వ్యవహారంపై పోరాడదామని షర్మిల ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. అయితే కాంగ్రెస్తో కలిసేది లేదని తాను స్పష్టం చేశామన్నారు.