NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పేరును ప్రకటించారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో జగదీప్ ధన్కర్ ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రజల గవర్నర్​గా పేరు సంపాదించారని కొనిడాయారు. నవభారత్ స్ఫూర్తికి ఆయన జీవితం అద్దం పడుతుందని బిజెపి నేతలు చెప్పుకొచ్చారు. ఆర్థిక, సామాజికపరమైన అనేక అడ్డంకులు, అవాంతరాలు అధిగమించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని వివరించారు. జగదీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

రాజస్థాన్‌లోని కిథానా అనే గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్ ధన్కర్.. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1989లో ఝుంఝును నుంచి జనతాదళ్ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన జగదీప్.. సుప్రీం కోర్టు న్యాయవాదిగా, రాజస్థాన్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2019 జూలై 30న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన్ను బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. ఇక ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జూలై 19తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియనుంది.