మార్పు రావాలంటే అది గోదావరి జిల్లాలతోనే సాధ్యమన్న పవన్ కళ్యాణ్

మార్పు రావాలంటే అది గోదావరి జిల్లాతోనేనని , ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే శక్తి ఉభయ గోదావరి జిల్లాలకు ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించి..ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారికీ ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్బంగా మండపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. తమ పార్టీ అభ్యర్థులను చూడొద్దని..,తనను చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే పులివెందుల వరకు వెళ్తుందని అన్నారు. మార్పు కోసమే జనసేన పార్టీ వచ్చిందని.., జనవాణి పెట్టగానే వైస్సార్సీపీ నేతలకు మెలకువ వచ్చిందని ఎద్దేవా చేశారు.

‘వైఎస్సార్సీపీ నాయకుల దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ల జేబుల్లో నుంచి డబ్బులు తీయమని అడగటం లేదు. ప్రభుత్వానికి పనుల్లో నుంచి వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని కౌలురైతులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. 3 వేల మంది కౌలు రైతులు చనిపోతే 700 మందికే పరిహారం ఇచ్చారన్న పవన్.. జేబుల్లో నుంచి డబ్బులు తీసి ఇవ్వడం తమకేం సరదా కాదన్నారు. ఎన్నికలు వచ్చాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేస్తామనడం కంటే.. ముందు కౌలు రైతుల కుటుంబాలు పడుతున్న బాధను చూడలేక ఇస్తున్నామని పవన్ తెలిపారు. చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వంలో లేకున్నా కౌలురైతులకు సాయం చేస్తున్నామన్నారు. మనకు ధైర్యం లేకుంటే అరాచకమే రాజ్యం ఏలుతుందని హితవు పలికారు. ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేసే బాధ్యత యువత తీసుకోవాలని సూచించారు.