భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష..రూ. 8 కోట్ల తక్షణ సాయం

అల్పపీడన ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. తీర ప్రాంత గ్రామాలను ముంచెత్తుతోంది. పోలవరం సహా పలు లంక గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలవరం ప్రాజెక్ట్, ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను అధికారులు ఎత్తేశారు. వరద నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై జగన్‌ దిశనిర్దేశం చేశారు.

ఈ సందర్భాంగా జగన్ మాట్లాడుతూ..గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని, జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని తెలిపారు.

కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. కంట్రోలు రూమ్స్‌ సమర్థవంతంగా పనిచేయాలి. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని సూచించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండండి. చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోండి. బోట్లు, లైఫ్‌ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచండి. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్‌గోదావరి, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.